Revanth Reddy: 400 స్థానాల్లో గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేయవచ్చుననేది బీజేపీ కుట్ర: రేవంత్ రెడ్డి

  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ జనాభాను లెక్కించి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ
  • దేశాన్ని రిజర్వేషన్ రహిత హిందూ దేశంగా మార్చాలనేది బీజేపీ కుట్ర అన్న రేవంత్ రెడ్డి
  • రిజర్వేషన్ రద్దుపై కిషన్ రెడ్డి, ఈటల, కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్న
Revanth Reddy alleges bjp trying to demolish reservations

400 లోక్ సభ స్థానాల్లో గెలిస్తే ఎవరి అవసరం లేకుండా రిజర్వేషన్లను రద్దు చేయవచ్చుననేది బీజేపీ కుట్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే బీసీ జనాభాను లెక్కించి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు సరైన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

2025తో ఆరెస్సెస్‌ను స్థాపించి వందేళ్లవుతుందన్నారు. ఈలోగా భారత్‌ను రిజర్వేషన్ రహిత... హిందూదేశంగా మార్చాలని ఆరెస్సెస్ ఎప్పుడో చెప్పిందన్నారు. ఇందుకోసమే బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. బలహీనవర్గాలపై మోదీ, అమిత్ షా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

అరెస్సెస్ భావజాలం... మనువాదభావజాలం కోసం బీజేపీ 400 సీట్లు కోరుతోందని మండిపడ్డారు. రిజర్వేషన్లను రద్దు చేసి హిందూ దేశంగా మార్చాలనేది బీజేపీ కుటిలయత్నమన్నారు. బీసీ రిజర్వేషన్లు పెరగాలంటే జనాభా లెక్క కావాలని... అందుకు కాంగ్రెస్ సిద్ధమన్నారు. కానీ ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు.

బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. కాంగ్రెస్ ప్రశ్నలకు మోదీ, అమిత్ షాలు సమాధానం చెప్పడం లేదన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఒక్క మాట మాట్లాడటం లేదని విమర్శించారు.

కేసీఆర్ కూడా రిజర్వేషన్ల రద్దు అంశంపై మాట్లాడటం లేదన్నారు. జైల్లో ఉన్న బిడ్డ కోసం బీజేపీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి, పోవాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి సాక్షిగా చెబుతున్నానని... పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేస్తానని పునరుద్ఘాటించారు. హరీశ్ రావులాంటి వ్యక్తులు రాజీనామా చేస్తే పీడ పోతుందన్నారు.

More Telugu News